అదే నేను (పార్ట్ -2)
మాది ఓ పల్లెటూరిలో ఉమ్మడి కుటుంబం. తాతయ్యగారు, నాయనమ్మ,నాన్న,అమ్మ,బాబాయ్,పిన్ని,అత్తయ్య,మావయ్య ఇంకా మా పిల్లల మంద అంతా కలిసే ఉంటాం. అందర్లో మొదటి ఆడపిల్ల నేనే కావడం తో కాస్త గారాబం, బెట్టు ఎక్కువే. నాకు నా పేరంటే అస్సలు ఇష్టం ఉండదు. నాయనమ్మ కి అమ్మవారంటే భక్తి, ఇంట్లో తొలిచూలు ఆడపిల్లనని "చాముండేశ్వరి" అని పెట్టారు నా పేరు. నాకా పేరు పెట్టినందుకు రోజుకోసారైనా ఇంట్లో గొడవ పడనిదే నాకు రోజు గడవదు.
లేచి కాఫీ తాగి తయారయ్యేసరికి వచ్చింది నాయనమ్మ గదిలోకి.
"చాముండీ.. నీ పీజీ డిగ్రీ ఆఖరి ఏడు పూర్తవుతోంది కదటే, ఇక పెళ్లి చేసుకోవే"..
పెళ్లి అన్న మాటకే అదిరి పడ్డాన్నేను, "నాయనమ్మా నేనప్పుడే పెళ్లి చేస్కోను, ఇంతా చదువుకున్నది పెళ్లి చేస్కుని పిల్లల్ని కనడానికా, కుదరదు అంతే"
చిర చిరా నా బాగ్ తీసుకుని వెనక గుమ్మం నుంచి బయట పడ్డాను. సందు దార్లో బస్టాప్ కి వచ్చాను. వీధి గుమ్మం నుంచి బస్టాపు దగ్గరే అయినా వీధిలో తాతయ్యగారి కంట ఈ పంజాబీ డ్రస్ లో కనబడితే ఆయన మండిపడతారు. ఓసారి ఆ అనుభవం కుడా అయ్యింది.
"చాముండేశ్వరి, ఈడొచ్చిన ఆడపిల్లవి ఇలాంటి బట్టలతో కాలేజీ కి వెడితే నలుగురూ ఏవనుకుంటారు? పోయి పరికిణి వోణి వేస్కో"
ఆ రోజు తాతయ్యగారి గర్జన కి ఉలిక్కి పడ్డ నేను మరింకెప్పుడూ అలా ఆయన కంట పడటానికి సాహసించలేదు.
ఏమైనప్పటికి నాకు మా ఊరి వాతావరణం పెద్దగా కిట్టేది కాదు. ఎప్పుడెప్పుడు చదువు పూర్తి చేసేసి ఒక ఉద్యోగం చేస్కుందామా అని ఉండేది. మా ఊరి కరణం (మాజీ అయినా అలా అనడం అలవాటు) గారి మనవరాలు భార్గవి కీ నాకు మంచి స్నేహం. నేను ఎం.ఎస్.సి చదువుతుంటే అది హైదరాబాద్ లో మెడిసిన్ చదివేది. సెలవులు రావడం పాపం, దాని కోసం ఎదురు చూసి చూసి అది వస్తే చాలు దాన్నోదిలే దాన్ని కాదు. మామూలు గా నే స్వతంత్ర భావాలు ఉన్న నేను దాని మాటల వల్ల ఎలా ఐనా ఇంటికి దూరం గా వెళ్లి స్నేహితుల మధ్య ఎంజాయ్ చెయ్యాలనుకున్నాను.
చూస్తుండగా సంక్రాంతి సెలవులిచ్చేసారు.
*ఇంకా ఉంది*

No comments:
Post a Comment