అదే నేను పార్ట్-7

అదే నేను పార్ట్-7






      కొత్త అనేదేదైనా పాత కాక మానదు.  రోజులు నిర్లిప్తం గా గడవడం మొదలెట్టాయి.  చిన్నప్పటి నుంచీ ప్రేమ ఆప్యాతల మధ్య పెరిగిన నాకు ఈ బిజీ జీవితం చెప్పలేని నిరాశ గా అనిపించింది.  ఇంటికి వెళ్ళాలనిపించింది.  నాయనమ్మని అమ్మని చూడాలనిపించింది.  ఆ రోజు ఆఫీసు లో మా టీమ్ లీడర్ ని అడిగాను రెండు రోజులు లీవ్ కావాలని, "ఇట్ ఈస్ వెరీ క్రుషియల్ టైం ఫర్ అస్, ఐ కెన్ నాట్ శాంక్షన్ లీవ్ నౌ" అని ముగించాడు, మొఖం వైపు కూడా చూడకుండానే.  భార్గవి కూడా సంక్రాంతి కి వెడదాం లే అని సర్ది చెప్పింది.

చివరికి మళ్ళా సంక్రాంతి మాసం రానే వచ్చింది. నేను సంబరంగా బట్టలు సర్దుకుని ఆఫీసు కి వచ్చాను.  గబా గబా లీవ్ అప్లై చేసి   వర్క్ మొదలు పెట్టాను. దృష్టి పని మీద కన్నా ఇంటి మీదే ఎక్కువ గా ఉంది. ఇన్నాళ్ళ తర్వాత ఇంటికి వెడితే  అందరూ ఎలా ఫీల్ అవుతారో, ఎంత సంబర పడతారో, ఎంత ప్రేమ కురిపిస్తారో ఇలా ఊహల్లో ములిగిపోయి వెంటనే వచ్చిన  రిప్లై మెయిల్ బ్లింక్ గమనించనేలేదు.  కోటి ఆశలతో మెయిల్ ఓపెన్ చేసాను.  ఒక్కసారి గా నీరుగారిపోయింది మనసు, టీం లీడ్స్ ముగ్గురు లీవ్ లో ఉండటం వల్ల, ఈ మంత్ సింగిల్ లీవ్ కూడా కుదరదని కన్ఫర్మ్ చేసేసాడు. ఆపైగా ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఒకటి.  

                                                             *******************

ఆలోచనల్లోంచి నేను వాల్ క్లాక్ గంట సైరన్ వినిపించి ఈ లోకం లోకి  వచ్చాను.  మళ్ళా అద్దం లో ఆ నేను, ఆక్షణం లో నాకెంత మాత్రం నచ్చలేదు.  పోనీటెయిల్ గా మారిన ఉంగరాల జుట్టు,  స్టిక్కర్ గా మారిన ఎర్రటి తిలకం,  నుదుటన కనిపించాల్సిన  ఎరుపుని అద్దుకున్న పెదవులు, జీన్స్ ప్యాంటు, టాప్, ఏక్షన్ షూ. ఒక్కసారిగా  ఆ ఆకుపచ్చటి లంగావోణి  లో ఆనాటి నా రూపం నాకు గుర్తొచ్చింది.  డెస్క్ లోకి వచ్చి కూర్చున్నాను.  న్యూ మెయిల్ ఎలెర్ట్  చూపిస్తోంది నా డెస్క్ టాప్.  రకరకాల రంగులు ముగ్గులు బొమ్మలతో కూడిన సంక్రాంతి సందేశం అది.  "హు" పైకే వచ్చేసింది నా నిరాశ తాలూకు శబ్దం.  నేను పరుగెత్తి అందుకున్నదేంటో అని ఆలోచిస్తే మనసు అయిదు వందల కిలోమీటర్లు ప్రయాణించి మా ఇంటి చుట్టూ తిరిగింది.

నాలో నేను చాలా సార్లు తర్కించుకున్నాను.  నిజం గా చదివిన చదువుకి సార్థకత రావాలని నేను రాలేదు, కేవలం  మా ఊరి మీద అయిష్టం తో  సిటీ జీవితం మీద మోజుపడి మాత్రం వచ్చాను.  నాయనమ్మ ఒడి చల్లదనం ముందు  ఈ ఏ.సి చల్లదనం హిమాలయం ముందు మంచు బిందువు లా కనిపించింది.  అమ్మ వంటలో కమ్మదనం ఈ మెస్ భోజనం లో  ఎక్కడుంది? చూపెక్కడో, మనసెక్కడో ఉంచుకుని మాట్లాడే ఈ సిటీ బాబులతో పోల్చుకుంటే రాముడు గొప్ప  సంస్కారవంతుడి లా అనిపించాడు నాకా క్షణం.

ఏదో స్ఫురించినట్టు గబగబా స్పందించాను.     నిన్నటి టీం లీడర్ మెయిల్ కి రిప్లై సెండ్ చేసి, ఆరోజు వర్క్ కంప్లేట్ చేసాను. 7 కి నా లాగ్ ఔట్. రోజూ లాగా హాస్టల్ కి రాగానే పడుకోలేదు, రెడీ అయ్యి షాపింగ్ కి బయలుదేరాను, ముందుగా తత్కాల్ లో టికెట్ బుక్  చేసుకుని.  అప్పుడే లేచి కాఫీ తాగుతోంది భార్గవి.  నా హడావిడి చూసి "ఏంటే, ఏదైనా ప్రోగ్రామా, ఇంత ఎర్లీ గా రెడీ అయిపోవావ్?"
"లేదు భార్గవీ" టీం లీడర్ కి సబ్మిట్ చేసిన రెసిగ్నేషన్ మెయిల్ గురించి చెప్పాను. తెల్లబోయింది భార్గవి, ఆ వెంటనే తేరుకుని, నీకేమైనా పిచ్చా, ఇంత కష్టపడి ఇంట్లో ఒప్పించావో మర్చిపోయావా?, ఇప్పుడు వెళ్తే మీ బావకిచ్చి పెళ్లి చేస్తారు"
"ఇంట్లో వాళ్ళని వదిలి నేను ఉండలేను భార్గవీ.., ఆపైన, నేనేదో సరదాపడి  గా ఇక్కడికి వచ్చాను, దూరపు కొండలు నునుపు అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది.  ఉద్యోగమే అయితే మన ఊరిలో కూడా చేసుకోవచ్చు, అందుకు మావాళ్ళు కాదనరు. నాకీ ఎంజాయ్ మెంట్ వద్దే, ఇంట్లో వాళ్ళని మోసం చేస్తూ నేనిక్కడ ఉండలేను" మాటలతో పాటు  మా సంభాషణ కూడా ముగించాను!!" ఏదో చెప్పాలనుకుంది భార్గవి కాని నేను చెప్పులు వేసుకుని డోర్ తీయడంతో దానికి అర్థమయ్యింది, నేనింక చెప్పినా విననని.

ఒకరితర్వాత ఒకరికి వరుసగా నాయనమ్మకి, తాతయ్యగారికి, నాన్నగారికి, అమ్మకి ఇలా అందరికీ బట్టలు కొన్నాను. చివరగా రాముడికి, ఏదైనా విభిన్నం గా ఇవ్వాలనిపించింది.  ఆ రోజు నాకు కలిగిన సంతోషం, త్రుప్తి ముందెప్పుడూ కలగలేదు.

తెల్లవారితే భోగి అనగా రాత్రి నిద్రే పట్టలేదు, చివరికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నరసాపురం స్టేషన్ రానే వచ్చింది. ట్రైన్ దిగి ఇంటికి ఫోన్ చేసాను. ఒక్కో నంబరు కొడుతుంటే నా మనసు పరవశం తో పరవళ్ళు తొక్కింది, రింగ్ అవుతుంటే నే  ఎత్తినట్టు మాట్లాడినట్టు నాలో నేనే మాటలు వల్లెవేసుకోడం మరీ నవ్వు తెప్పించింది.
"హలో, ఎవరండీ"
"బాబాయ్, నేను, చాముండి ని."
"చెప్పమ్మా, అంతా కులాసానా??"
"కులాసానే బాబాయ్, నేను పొద్దున్న బండికి నరసాపురం దిగాను" నా గొంతు లో సంతోషం, నా మాటల్లో ఉద్వేగం నాకే తెలుస్తున్నాయి.
"అలాగా అమ్మా, చాలా సంతోషం తల్లీ, నువ్వక్కడే ఉండు, నేను గానీ నాన్న గాని వస్తాం." అవతల ఫోన్ కట్టయ్యింది.
నా కన్నా ముందే మనసు ఇల్లు చేరింది. ఊహల్లో తేలుతూ అలా ఉండిపోయాను.
"చాముండీ" అన్న పిలుపుకి వాస్తవం లోకి వచ్చి వెనక్కి తిరిగి చూసాను.
రాముడు బావ.... కళ్ళ  నిండుగా సంతోషం నింపుకుని చూస్తున్నాడు.
నా కళ్ళల్లో మెరుపు, దాచుకోలేకపోయిన నవ్వు, సంతోషం అణుచుకుంటూ బావని అనుసరించాను.

నా చేతిలో పెట్టె అందుకుంటూ ఆశ్చర్యం గా అన్నాడు, "ఏంటి, మొత్తం హైదరాబాద్ నీ పెట్టె లో పెట్టి తెచేస్తున్నావా?" అడిగాడు రాముడు. ఏం  చెప్పాలో తెలియక నవ్వాను.

ఎనిమిది నెలల దూరం నిశ్శబ్దం గా ఏవో ఊసులు చెప్పుకుంటోంది.  మాములుగా నేనెప్పుడూ రాముడి తో మాట్లాడను, అందుకే అనుకుంటా, మధ్య మధ్యలో నావైపు చూస్తూ ఉన్నా, మౌనం గానే ఉన్నాడు రాముడు.  ఇంటికి కాస్త దూరం నుంచే అంతా బయట నిలబడి కనబడుతున్నారు. పూర్తిగా దగ్గరికి వచ్చేసరికి నా కళ్ళకి ఏమీ కనబడనట్టు అనిపించింది.  నాయనమ్మని చూడగానే, కళ్ళని పూర్తిగా కమ్మేసిన నీటి పొర కట్టలు తెంచుకుని చెంపలమీదికి ఉరికింది.  "నాయనమ్మా" అంటూ కౌగిలించుకున్నాను. అందరి కళ్ళల్లో చెప్పలేని సంతోషం.  అమ్మయితే మరీనూ, బయటికి చెప్పుకోలేకపోయినా, మొఖం లో దీపావళి వెలుగులు నింపింది.

"బాగా నల్లబడ్డావే తల్లీ, నాయనమ్మ అంది. కుశల ప్రశ్నలు సమాధానాలు అయ్యాక, మనసులో పదిలం గా దాచుకున్ననాయనమ్మ కాఫీ రుచి, అధరం గరళం మీదుగా హృదయాన్ని తాకింది.  స్నానం చేసివచ్చి, అందరికీ వాళ్ళ వాళ్ళ బహుమతులు అందించాను.  తాతయ్యగారికి దణ్ణం పెట్టి పక్కనే కూర్చున్నాను. వెనకవైపు భుజం తట్టి, " నువ్వు చెప్పింది, నిజమే రా రాముడూ, బయటి ప్రపంచం చూసోచ్చాక ఎంత మార్పు కనబడుతోందో చాముండి లో" అన్నారు. రాముడు నేనూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాం.  ఒకరకం గా అదీ నిజమే, ఇల్లు వదిలి వెళ్లి ఉండకపోతే ఈ ప్రేమ, ఆప్యాయతలకి అర్థం ఎప్పటికీ తెలిసేది కాదేమో.  ఇంట్లో అందరూ నాలో వచ్చిన మార్పుకి సంతోషపడ్డారు. నాయనమ్మైతే  "ఎంత ఎదిగిపోయిందో నా మనవరాలు" అంటూ మెటికలు విరిచి దిష్టి కూడా తీసేసింది.

                                                                                                                                   -ఇంకా ఉంది-


1 comment:

  1. How about transliterating the pages and allowing non Telugu readers a chance to know about your blogs.

    ReplyDelete