అదే నేను (పార్ట్ -3)


అదే నేను (పార్ట్ -3)




ఇల్లంతా  దులుపుళ్ళు, కడుగుళ్ళు . మరో మూడు రోజుల్లో భోగి పండగ అనేసరికి భార్గవి రానే వచ్చింది.  ఇంక నా ప్రపంచం దానితోనే.  గుమ్మం ముందే ఉంది లోపలికి తొంగి చూసాను. భార్గవిని వాళ్ళమ్మ ఎందుకో తిడుతోంది, కూడా భార్గవి గొంతు కూడా కలిపి వినపడుతోంది.
"భార్గవీ"... పిలవాలా వద్దా అనుకుంటూనే పిలిచాను.
"ఏయ్, చామూ హాయ్ ఎలా ఉన్నావ్, రా లోపలికి"
నా మొహం లో ఏదో సంతోషం.  నా పేరుని నాకిష్టమయినట్టుగా  పిలిచేది అదొక్కత్తే.
"బావున్నానే, ఎప్పుడొచ్చావు?" అంటూ లోపలి నడిచాను.  భార్గవి ని చూసి చూపు తిప్పడం నా వల్ల అవ్వలేదు. అసలిది భార్గావేనా అని అనుమానం వొచ్చింది.  బారెడు జడ పోయి చెవుల కింద రింగులు తిరుగుతున్న జుట్టు, చెవులు దాటి భుజాలకి తగులుతూ చెవి రింగులు, జీన్స్ ప్యాంటు, టీషర్ట్. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది భార్గవి.
"ఏంటే  బాగాలేనా నువ్వు కుడా అలా చూస్తున్నావ్?" భార్గవి 
"ఎంత మారిపోయావే భార్గవీ?.. ఇంత అందం గా ఎలా తయారయ్యవే?" గుడ్లప్పగించి భార్గవిని అల్లాగే చూస్తూ అడిగాను.
"ష్, మెల్లగా మాట్లాడవే తల్లీ, ఇప్పటివరకు దీనిగురించే మా అమ్మ తో గొడవ"
"అయ్యో  ఏమైంది?" అడిగాన్నేను
"ఏముంది వచ్చిన దగ్గర్నుంచి  నస, నువ్వే విను"
" పెళ్లి కావలసిన పిల్లవి, ఇలా జుట్టు కత్తిరించుకుని, ప్యాంటు చొక్కా వేస్కుని మగ రాయుడిలా తయారైతే నలుగురూ ఎవనుకుంటారే? ఎవరైన చూస్తే నవ్విపోతారు. ఆ సిటీల్లో చదువులు వొద్దని నెత్తి నోరు మొత్తుకున్న  నా మాట విన్నారు కాదు మీ నాన్న.  చూస్తూ ఊరుకుంటుంటే నీ ఆగడం మితిమీరుతోంది.  చదువూ సంధ్యా  కట్టిపెట్టి ఇంటిపట్టున కూర్చో.  గన్నవరం సంబంధం వాళ్ళు 'ఉ' అంటే తాంబూలాలకి సిద్ధం  గా ఉన్నారు" లోపలనుంచి వాళ్ళమ్మ గొంతు బిగ్గరగా వినపడుతోంది.


అదీ నేను మాత్రం మాటల్లో ములిగిపోయాం. నేనైతే చెప్పింది కన్నా విన్నదే ఎక్కువ  ఫ్రెండ్స్ తో సినిమాలకీ  షికార్లకి తిరగడం, కాలేజీ ఎగ్గొట్టి ఎంజాయ్ చెయ్యడం, షాపింగులు, సరదాలు అన్నీ చెప్పి, ఇలా ఇంట్లో ఉండటం వాళ్ళ నా లాంటి వాళ్ళు మిస్ అయ్యేదేంతటో  కూడా చెప్పింది భార్గవి. నేనేమో మంత్రముగ్ధ  లా ఆలకిస్తూ ఉండిపోయాను.


"చాముండీ...చాముండీ బాగా ఆలస్యమయింది.  నాయనమ్మ భోజనానికి రమ్మంటోంది, తినకుండా నీ కోసం ఎదురు చూస్తోంది"
ఊహల్లో విహరిస్తున్న నాకు ఆ మాటలు చేదు గా వినిపించాయ. కటకటాల్లోంచి  బయటికి చూసాను.  మా బావ, రామ కృష్ణ , అంతా రాముడూ.. అని పిలుస్తారు.  మా మేనత్త కొడుకు. చిన్నప్పటినుంచీ  ఒకే చోట పెరిగినా మా మధ్య స్నేహం తక్కువ.  అందుక్కారణం మొదట్నుంచీ నాకు వాళ్ళ పట్ల ఉన్న చులకన భావన.
 నాయనమ్మకి మాత్రం నాకూ, రాముడికీ పెళ్లి చేసి నేనిదే ఇంట్లో ఉండాలని ఉద్దేశం.  ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచీ రాముడంటే మరింత చిరాకు పడటం మొదలు పెట్టాన్నేను.
"అబ్బా గోల, కాసేపు ప్రశాంతం గా ఉండనివ్వరు," అనుకుంటూ "సాయంత్రం మళ్ళా వస్తానే", అంటూ బయటికి నడిచాను.

రాముడికి నేనంటే కాస్త ఇష్టమే, పెద్దగా మాట్లాడక పోయినా చనువుగా ప్రవర్తిస్తాడు.  అహంకారం అస్సలు ఉండదు, మంచివాడే అయినా అతనంటే కిట్టక పోవడం వల్ల నేను మాత్రం చీటికీ మాటికీ మండిపడుతూ ఉంటాను.

"నే వస్తా లే నువ్వెళ్ళు" చిరాగ్గా  అన్నాన్నేను.
"పర్లేదు చాముండీ, బండి మీదే వచ్చాను, నేను దింపేస్తాలే" అన్నాడు రాముడు.
చివాల్న లేచింది నాకు కోపం.  కానీ అంతలోనే అటుగా వెళ్తున్న బాబాయ్ మమ్మల్ని చూసి ఆగాడు.
"ఆలశ్యం  అయిపోయిందమ్మా, నాయనమ ఎదురు చూస్తోంది, త్వరగా ఇంటికెళ్ళిపో , రాముడూ... అమ్మని ఇంటిదగ్గర దింపి నువ్వు మలికిపురం వచ్చేయ్" అంటూ వెళ్ళిపోయాడు బాబాయ్.

బాబాయి కి నేనంటే చాలా ప్రేమ. అమ్మా... అంటూ  ప్రేమగా పిలుస్తాడు.ఇంట్లో ఎంత చనువున్నప్పటికీ బయట ఎక్కడైనా కనబడితే పలకరించడానికే భయం.  ఆ ఊరిలో ఆయనకున్న పేరు పలుకుబడులు అలాంటివి చివరికి చేసేది లేక, వోణి నడుముకి బిగించి రాముడి బండి ఎక్కాను.
రాముడి మోహంలో ఏదో గర్వం, సంతోషం నేను గమనించకపోలేదు.  నాకు మాత్రం ఒళ్లు  మండిపోయింది.  మొదటి నుంచీ కాబోయే భర్త ని  సినిమా హీరో లా అందం గా, ఊహించుకునేదాన్ని , అందుకేనేమో చూడటానికి రాముడు నా కన్నా బాగానే ఉన్నా నాకు మాత్రం నచ్చేవాడు కాదు.  బండి దిగి విస  విసా లోపలికి వచ్చి అమ్మ మీద అరవడం మొదలెట్టాను.
"మూడు నెల్ల తర్వాత భార్గవి ని కలిసాను, కాస్సేపు కూడా కుర్చోనివ్వరా?.."
"అన్నం తినేసి వెళ్ళమ్మా, ఎల్లుండే కదా పండగ, ఇంటి నిండా బోలెడంత పని, భోజనాలు అయితే కదా మిగతా పన్లు పూర్తయ్యేది? " అమ్మ సముదాయించింది.
నేను మరేదో చెప్పబోయే లోపు నాన్నగారొచ్చారు గదిలోకి.  ఆయన చూపులు చదవగలిగిన నేను మరింక నోరు మెదపలేదు.
నాన్నగారు నాకు తెలిసీ ఎప్పుడూ నా మీద కోప్పడలేదు.  అలా అని మాట్లాడకుండా ఊరుకునే తత్వం కాదు ఆయనది .  చాల తక్కువ మాట్లాడతారు. తర్కానికి మాత్రం ఆమడ దూరం, అదే ఆయన తత్వం.  ఏది ఏమైనా నేను కూడా నాన్నగారికి నచ్చనిదేదీ చేసేదాన్ని కాదు. ఎందుకంటే మా ఇంట్లో ఎదైనా విషయాన్ని బాగా అలోచించి నిర్ణయం  తీసుకునేది నాన్నగారొక్కరే.

                                                                  * * * * *
                                                                                                                              -ఇంకా ఉంది-
                                                                                                                             

No comments:

Post a Comment