అదే నేను పార్ట్ -6

అదే నేను పార్ట్ -6

                         ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాయంత్రం రానేవచ్చింది. కలా  నిజమా అనిపించింది నాకాక్షణం.  నా  మొహం ఆనందం  తో వెలిగిపోతోంది.  మనసు దూదిపింజ లా  అయింది. ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదో కోల్పోయినట్టు విషన్న వదనాలతో కనిపించారు.  నాయనమ్మైతే మరీను, నా చేయి పట్టుకుని వదలలేదు." జాగ్రత గా ఉండు తల్లీ, ఇల్లు విడిచి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు, బెంగ పడకమ్మా..." చీర కొంగు తో కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది. అమ్మ ముఖమైతే  ఎర్ర మందారం లా కనపడింది, కళ్ళలో నీళ్లూరుతున్నా గుంభనం గా ఉండి, నా  సామాను సవిరిస్తోంది.  బాబాయి  నిమిషానికో జాగ్రత్త చెప్పి నాకు మరీ విసుగు తెప్పించాడు.  "ఛ, వీళ్లెవరికీ నేను సంతోషం గా వెళ్ళడం ఇష్టం లేదు, ఒక్కరైనా నవ్వుతూ పంపచ్చు గా" అనుకున్నాను. 
నాయనమ్మ పక్క నే కూర్చుని చెక్కిలి నిమురుతూ "సెలవులివ్వగానే ఇంటికి వచ్చేయ్యవే" అనేసరికి నాకు విసుగు రెట్టింపయ్యింది.  "అబ్బా నేనేమైనా విదేశాలకి వెళ్ళిపోతున్నానా?, చీటికీ మాటికీ సెలవివ్వడానికి అదేవీ స్కూలు కాదు, టైం అవుతోంది, నే వెళ్లి రెడీ అవుతాను" తప్పించుకున్నాను. 
సెలవు దొరికితే ఇంటికి మాత్రం రాకూడదు, భార్గవి తో కలిసి ఊరంతా తిరగాలనుకున్నాను.
అమ్మ నా బట్టలు సర్దుతోంది. స్టేషను కి  తాతయ్యగారు  కూడా వస్తున్నారు.  తప్పనిసరిగా లంగా వోణి వేస్కోవాలి, అమ్మ ఆ  పసుప్పచ్చ లంగావోణి  మంచం  మీద పెట్టింది, దాన్ని చూడగానే నాకు కోపం పొంగుకొచ్చింది.  మరికాసేపట్లో  దీని పీడా విరగడవుతుంది, ఎప్పుడు గొడవెందుకని మాట్లాడకూరుకున్నాను.

తాతయ్యగారు, నాన్నగారు, మామయ్య, బాబాయి, ఆ రాముడు నాతో స్టేషన్ కి వచ్చారు.  మరుసటి రోజు రైలు దిగినప్పుడు భార్గవి ని  వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమని కరణం  గారబ్బాయి (భార్గవి వాళ్ళ నాన్న) తో చెప్పారు నాన్నగారు.   మాకు హైదరాబాద్ లో చుట్టాలు, తెలిసినవాళ్ళు వేరెవ్వరు లేరు, భార్గవి తప్ప.
అందరి మొహాల్లో ఏదో చిరాకు కనబడుతోంది ఒక్క రాముడి మోహంలో తప్ప.   అతని మోహంలో మాత్రం స్వచ్చమైన  ప్రోత్సాహం, సంతోషం కలగలిసిన చిరునవ్వు. రాముడిని చూసి నేను  నవ్వడం అదే మొదటిసారి కావచ్చు. ఆ మాత్రం నవ్వుకే పులకించిపోయాడు . సంతోషం ఉప్పొంగే కళ్ళ తో నా  వంక ప్రేమ గా చూసాడు. కాని అతని  చూపు నా కళ్ళని దాటి మనసు దాకా చేరకముందే మా నిశ్శబ్దాన్ని చీలుస్తూ నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ పట్టాలమీదకొచ్చింది.  

                                                       ********************

నా మనసు రెక్కలు తొడిగిన పక్షి లా రెపరెపలాడింది.  కొత్త జీవితం, ఉద్యోగం, సంపాదన ఇవన్నీ ఎంతో బాగా అనిపించాయి. మొదట్లో ఆఫీసు లో బెరుగ్గా  బేలగా ఉన్న  నేను కొన్ని రోజులు గడిచేసరికి కాస్త అలవాటు పడ్డాను. కల్చర్ ఫాలో అవ్వాలే ,  మన ఊరిలో ఉన్నట్టు ఉంటే అస్సలు కుదరదు, అని నాకు బాగా హితోపదేశం చేసింది భార్గవి. ఇంకేం, జీతం కూడా చేతిలో పడింది. నాకు నేనే గుర్తురానంత గా మారిపోయాను. నన్ను నేను అద్దంలో చూసుకుని మురిసిపోయాను.  ఆఫీసు లో నాతోటి వాళ్ళు పొగుడుతుంటే ఎంతో బాగా అనిపించేది.  ఆడపిల్లని చూసి సిగ్గుపడి, మాట్లాడటానికి తటపటాయించే రాముడి లా కాదిక్కడి అబ్బాయిలు.  ధైర్యం గా మొఖం మీదే పొగిడేవారు, మనసుకి గిలిగింతలు పెట్టినట్టుగా అనిపించేది.  ఇక గడిచిన మూడు నెలలలో నే చూడనిదంటూ లేదు.  మావాళ్ళతో  రోజూ ఫోన్  లో మాట్లాడేదాన్ని. నాయనమ్మ చూడలనుందంటూ రమ్మని పోరు పెట్టేది.  నిజానికి నాకంత తల మునకలయ్యేటంత  పని లేకపోయినా, క్షణం తీరిక లేదన్నట్టు మాట్లాడేదాన్ని.  అదే కల్చర్ అనుకున్నాను. మధ్యలో ఒకసారి మా ఊరి మనిషి ఒకతను హైదరాబాద్ వస్తుంటే నన్ను చూసి రమ్మని కూడా జంతికలు,సున్నుండలు  ఇచ్చి పంపారు. 

                                                                                                                                  -ఇంకా ఉంది-

No comments:

Post a Comment