అదే నేను పార్ట్-5
ఆరోజు నా రిజల్ట్స్, ఇంట్లో ఎవరినోట విన్నా నా పెళ్లి మాటలే, తాతయ్యగారైతే ఎంతో సంబరంగా బాబాయి ని, మామయ్యని పిలిచి నాన్నగారితో ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటున్నారు. నా మనసంతా చెప్పలేనంత ఆందోళన గా ఉంది, రాబోయే రిజల్ట్స్ గురించి కాదు, నా నిర్ణయం ఇంట్లో చెప్పిన తరువాత జరగబోయే పర్యవసానాల గురించి.
చూస్తుండగానే మధ్యాహ్నం మూడయింది.పిన్ని అందరికీ టీ అందిస్తోంది. టీ తాగుతూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం మా వాళ్ళ దినచర్య. ఎటొచ్చీ ఆ గుంపు లో చేరని ఒంటరి పక్షిని నేనే. ఇంతలో బాంబు పేలినట్టు నా క్లాసుమేట్ లలిత పరిగెత్తుకొచ్చింది.
"చాముండీ, ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యవే" ఒగురుస్తూ చెప్పింది.
మావాళ్లంతా తల తిప్పి చూసారు, అందరి కళ్ళలో సంతోషం తొంగిచూస్తోంది.
"పోన్లేవే చాముండీ, ఇన్నాళ్ళు చదువు ఇక పూర్తయ్యింది". నాయనమ్మ సంబరం గా అంది.
"లోపలి రామ్మా లలితా, టీ తీస్కో.." పిన్ని ఆహ్వానించింది.
లలిత వచ్చి కూర్చుంది, నేనూ వెళ్లి దాని పక్కనే చతికిలపడ్డాను.
"ఇక పైన ఎం చేద్దామనుకుంటున్నావమ్మా?" బాబాయి లలితని ఉద్దేశించి అడిగాడు.
"ఇంకా ఏమీ అనుకోలేదండీ, నాన్న గారి ఇష్టం, ఉద్యోగం చేద్దామనుకున్నాను కానీ, నాకంత అదృష్టం రాలేదండీ. ఎంతైనా చాముండి అదృష్టవంతురాలు. మా కాలేజి నుంచి సెలెక్ట్ అయిన ఆరుగురిలో చాముండి ఉందంటే నిజం గా అదృష్టమే. నాకంత అదృష్టం లేదు." అసూయ, బాధ ధ్వనించిన గొంతులో గబగబా అనేసింది లలిత.
నా గొంతు లో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. గబుక్కున లలిత కాలిమీద గట్టిగా గిల్లాను. కాని అప్పటికే అది చెప్పవలసింది, చెప్పకూడనిదంతా కలిపి చెప్పేసింది. అదలా చెప్పడానికి కారణం కూడా నేనే. ఫేర్వెల్ పార్టీ రోజు క్లాసు లో అందరి ముందరా జాబ్ లో జాయిన్ అవుతాఅని గొప్పలకి పోయాను. ఇంట్లో ఒప్పుకున్నారు అని కూడా సుత్తి కొట్టాను. కాని నాకు కాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చిన సంగతి ఇంట్లో ఎవరికీ తెలియనే తెలియదు.
అయిందేదో అయ్యింది, ధైర్యం తెచ్చుకుని గొంతు పెగుల్చుకున్నాన్నేను. ఆశ్చర్యం తో నా మొఖం లో కి చూడటం మా వాళ్ళ వంతయ్యింది.
"అవును, నాకు కాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ లో. నేను వెళ్తాను" నా లోగొంతులో సన్నని వణుకు.
ఇప్పుడిక మరింత ఆశ్చర్య పోవడం మా వాళ్ళ వంతయ్యింది.
"ఒంటరి గా ఆడపిల్లలు ఉద్యోగాలని వేరే ఊరికి వెళ్ళడం మన ఇంట్లో సరిపడదమ్మా, ఇవన్నీ వద్దు, వాళ్లకి జేరటం వీలు పడదని చెప్పేసెయ్" తాతయ్యగారు అధికారం, కోపం కలగలిసిన స్వరం తో హుకుం జారీ చేసారు.
కుతకుతా ఉడికిపోయాన్నేను, చురుగ్గా లేచి నుంచున్నాను,
"నాకు ఉద్యోగం చెయ్యాలని ఉంది, నేను జేరుతున్నాను" అని చెప్పేసి విసవిసా లోపలికి వెళ్ళిపోయాను. మంచంమీద బోర్లాపడుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. ఉక్రోషం తో కాళ్ళు, చేతులు, మొఖం వణికిపోయాయి. బయట, వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు.లలిత మాత్రం ఏమి అర్థం కాక అయోమయం గా ఓ అయిదు నిమిషాలు కూర్చుని "నే వెళ్ళొస్తానండి" అని బయలుదేరింది.
వసార్లోంచి వాళ్ళ మాటలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. ఏం మాట్లాడుకుంటున్నారో మాత్రం స్పష్టం గా తెలియలేదు.
కాసేపటికి సమావేశం ముగిసిందన్నట్టుగా అమ్మ గదిలోకి వచ్చింది. బాబాయి స్కూటర్ స్టార్ట్ చేస్కుని ఎక్కడికో బయలుదేరాడు. అమ్మ వచ్చిందే కాని నన్ను పలకరించకుండా వెళ్ళిపోయింది, నాకు ఉక్రోషం మరింత హెచ్చింది. కళ్ళలో నీళ్ళూరి మళ్ళా మరో పావుగంటకి శాంతించాన్నేను.
మూడు రోజుల మౌన సంఘర్షణ తరువాత చివరకి నా పంతం నెగ్గింది. ఇష్టం లేకుండానే మా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ మాటల్లో నాకర్దమయిందేంటంటే, రాముడే కలగజేసుకుని వాళ్ళని ఒప్పించాడట. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉద్యోగం చేయడం తప్పేంకాదని, బయటి ప్రపంచం లోకి వెళ్లి ఉద్యోగం చేయడంవల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్తే తాతయ్యగారు చివరికి అయిష్టంగానే సరే అన్నారట. కొసమెరుపేంటంటే "పెళ్లి చేసుకోబోయేది నువ్వు, నీ పెళ్ళాం నీ ఇష్టం రా రాముడూ.." అని కుడా అన్నారట.
వెళ్ళడానికి ఒప్పుకున్నారని మనసులో సంతోషం కలిగినప్పటికీ రాముడంటే మరింత ఈర్ష్య అసూయ కలిగాయి. మాట సాయం చేసాడన్న కృతజ్ఞత కంటే నా మాట కన్నా అతని మాటకే ఇంట్లో విలువ ఎక్కువని మరింత రగిలిపోయింది మనసు. ఆపైన ఈ పెళ్లి గోల ఒకటి. రాముడికిచ్చి పెళ్లి చేస్తారంటే ఉద్యోగం చేయబోతున్నానన్న ఆనందం కాస్తా పటాపంచలైపోయింది. ఈ గండం నుంచి గట్టేక్కాను కదా, ఆ సంగతి తరవాత చూడచ్చులే అని ఊరుకున్నాను.
ఆ రోజుకు నా ప్రయాణం సరిగ్గా వారం తరువాత, అంటే ఏప్రిల్ రెండవ వారం లో.
*******************
-ఇంకా ఉంది-

No comments:
Post a Comment