అదే నేను (పార్ట్ -4)

అదే నేను (పార్ట్ -4)


ఉదయం మూడింటికే తెల్లారిందారోజు.  అప్పటికే ఊరంతా సందడి. ఎక్కడ చూసినా రంగురంగుల ముగ్గులు, ఎర్రటి భోగిమంటలు. అప్పటికే కొత్త చీరలు కట్టుకుని మా అమ్మ ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తోంది.

"లేచావా తల్లీ.. త్వరగా తలంటుకొమ్మా.. నీకోసం కుట్టించిన పట్టు పరికిణీ వోణి  అత్తయ్య దగ్గరున్నాయి. తీసుక్కట్టుకో"  నాయనమ్మ ఉవాచ.
"సరే" అన్నాన్నేను అన్యమనస్కంగానే. పరికిణి వోణి  వేస్కున్టున్నానే కానీ నా మనసంతా భార్గవి మాటల మీదా ఆరోజు దాని అవతారం మీదా నిలబడిపోయింది.  మనసులో ఒక నిర్ణయానికొచ్చిన  నేను స్థితప్రజ్ఞ లా బయటికి నడిచాను.
ఊరంతా సందడి. పిల్లలు భోగుల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతున్నారు. ఇంటినిండా పిండివంటల ఘుమఘుమలు. మా ఇంట్లో పండగ నాడు వసారా నిండుగా అంతా కూర్చుని భోజనాలు చేస్తాం.  నాయనమ్మ, అమ్మ, పిన్ని, అత్తయా మినహా అంతా. వాళ్ళు మాత్రం  మాకందరికీ అయ్యాకే చేసేది, అదొక ఆచారమాట. నాకు మాత్రం ఒళ్ళు మండుకొస్తుంది. నువ్వూ నాతో తినమ్మా అని చాలా సార్లు పట్టు పట్టేదాన్ని కాని అమ్మ వచ్చేది కాదు .ఆరోజు భోజనాలలో రాముడి విస్తరి నాకెదురు గా ఉంది, వడ్డన మొదలయ్యింది.  అంతా భోజనం చేస్తున్నాం, అనుకోకుండా నేను రాముడి వంక చూసాను.  అప్పటికే అతని చూపు నాపై ఉండటం నేను గమనించకపోలేదు.  నేను చూసేసరికి  ఉలికిపాటుగా చూపు మరల్చుకున్నాడు రాముడు.  నేను మాత్రం చుర చురా చూసి తల దించేసుకున్నాను.  కానీ అప్పటి రాముడి చూపు లో ఏదో అమాయకత్వం, నాపై ఇష్టం, అనురాగం భయం తో మేళవించిన ఒక  అందమైన భావం. కాని ఇది ఏ మాత్రం హర్షించని నేను అక్కడిక్కడే వదిలేసాను
అరటి చెట్టు మొదట్లో చేయి కడుక్కుని వెనక్కి తిరిగి వస్తుంటే రాముడు ఇటుగా వస్తున్నాడు. నేను చూడనట్టే మాములుగా వెళ్ళిపోయాను.
"చాముండీ...." తడబడుతూనే పిలిచాడు రాముడు.
అప్పటికే నన్ను దాటి వెళ్ళిన అతడి వంక ఏమిటన్నట్టు ప్రశ్నార్థకం గా చూసాను.
"అదీ, మరేం లేదు, ఈ పసుప్పచ్చ పరికిణీ వోణి  లో నువ్వు చాలా అందం గా ఉన్నావు."
నేనది వినిపించుకోనట్టే వచ్చేసాను.  గదిలోకి వచ్చాక మాత్రం అద్దం లో చూసుకున్నాను. నేనేమీ అందగత్తెను కాను, నిజం చెప్పాలంటే మా ఇంట్లో మిగతా పిల్లల కంటే రంగు తక్కువ. చిన్నపుడు బాబాయి నల్లపిల్లా అంటే ఉడుక్కునేదాన్ని.  రంగు తక్కువైతే ఏం రా నా మనవరాలు బంగారం, అని నాయనమ్మ అంటే మమురిసిపోయేదాన్ని.  చంపకి చారెడు కళ్ళు, పది మందిలో అయినా నువ్వే కళ  గా వెలిగిపోతావ్ అని అమ్మ అంటే గర్వం తో నా ముఖం వెలిగిపోయేదే.

రాముడు చెప్పినట్టు ఆ డ్రస్ లో నేను బాగున్న మాట నిజమేనేమో కాని నాలో అహం దెబ్బ తినడం వాళ్ళ అంగీకరించలేకపోయాను.  సావిట్లో నాయనమ్మ వాళ్ళు భోజనాలకి కూర్చున్నారు.  వాళ్ళ మాటల్లో నాకు ఓ విషయం అర్థమైంది. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు రాముడే ఈ రంగు నాకోసం సెలెక్ట్ చేసాడట. ఆ మాట వినేసరికి        అసలే  ఉన్న చిరాకు రెట్టింపయ్యింది.  వెంటనే ఒక పాత పంజాబీ డ్రెస్ వేసేసుకుని వెనక దారిన భార్గవి దగ్గరికి పరిగెత్తాను.

                                                           ******************
                                                                                                                                         -ఇంకా ఉంది-

No comments:

Post a Comment